రాజావారు రాణిగారు అంటూ మొదటి సినిమాతో నటుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రెండో ప్రయత్నంగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని కోసం కిరణ్ అబ్బవరం రచయితగా మారారు. కథ కథనం మాటలు అన్నీ కూడా కిరణ్ అబ్బవరం సమకూర్చారు. ఇక హీరోగా, రచయితగా ప్రేక్షకులను కిరణ్ అబ్బవరం ఏ మేరకు మెప్పించారో ఓ సారి చూద్దాం. శ్రీ రాజ్యలక్ష్మీ కళ్యాణ మండపం అనే దానికి రాయచోటిలో ఓ చరిత్ర ఉంటుంది. వెంకటాచలం హయాంలో ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలని కోరుకునేంత ప్రాశస్త్యం ఉంటుందని చెప్పుకొస్తారు. కానీ ఆయన మరణానంతరం కొడుకు ధర్మ (సాయి కుమార్) మాత్రం దాని వైభవాన్ని కాపాడుకోలేకపోతాడు. ఊర్లో ఉన్న గౌరవమర్యాదాలను భ్రష్టుపట్టిస్తాడు. ధర్మ కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) కూడా అతడితో మాట్లాడటం మానేస్తాడు. కళ్యాణ్ తన చదువును ముగించుకుని విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ఇక కాలేజ్‌లో నడుము ఫ్యాంటసీతో సింధు (ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయి వెనకాల కళ్యాణ్ తిరుగుతుంటాడు. ఆమె తండ్రి పాపారావు (శ్రీకాంత్ అయ్యంగార్) వడ్డీ, తాకట్టు వ్యాపారం చేస్తాడు. SR కళ్యాణమండపంను ధర్మ అతని వద్ద తాకట్టు పెడతాడు. ఇక పరువు పూర్తిగా పోతోందని కళ్యాణ్‌ను అమ్మ శాంతి (తులసి) కళ్యాణమండపం బాధ్యతలను చూడమని కోరుతుంది. అలా ప్రేమించిన అమ్మాయి ఓ వైపు.. తాగుబోతుగా మారిన తండ్రి మరో వైపు.. SR కళ్యాణమండపం ప్రతిష్ట ఇంకో వైపు.. ఇలా కళ్యాణ్ చుట్టూ సమస్యలే వస్తాయి. వాటిని కళ్యాణ్ తిరిగి ఎలా సాధించాడు? ఈ క్రమంలో అతను చేసిన పనులేంటి? అసలు తండ్రికి దూరంగా కళ్యాణ్ ఎందుకు ఉంటాడు? చివరకు తండ్రీ కొడుకులు కలిశారా? లేదా అనే ప్రశ్నలకు సమాధానమే SR కళ్యాణమండపం. SR కళ్యాణమండపం సినిమాలో ఎక్కువగా కనిపించేది వినిపించేది కూడా కిరణ్ అబ్బవరం. కళ్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం బాగా నటించేశాడు.అయితే మాస్ ఇమేజ్ కోసం బాగానే పరితపిస్తున్నాడని అర్థమవుతోంది. అందుకోసం యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అలా యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ ఇలా ప్రతీ సీన్‌లో కిరణ్ అబ్బవరం మెప్పిస్తాడు. నటుడిగా కిరణ్ అబ్బవరం మరో మెట్టు ఎక్కాడాని చెప్పవచ్చు. ఇక కళ్యాణ్ పాత్ర తరువాత ఎక్కువగా నడిచేది ధర్మ పాత్రే. ఆ క్యారెక్టర్‌లో సాయి కుమార్ చాలా కొత్తగా అనిపిస్తాడు. తాగుబోతు తండ్రిగా, జులాయిగా బాధ్యతారాహిత్యంగా ఉండే తండ్రి పాత్రలో చక్కగా నటించారు. కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నింట్లోనూ సాయి కుమార్ చక్కగా సీన్లను పండించేశాడు. సింధు పాత్రలో ప్రియాంక జవాల్కర్ అందరినీ మెప్పిస్తుంది. కళ్యాణ్ మాత్రమే కాకుండా ఆమె నడుము మాయలో కుర్రకారు అంతా పడేలానే ఉన్నారు. అందంగా కనిపించడమే కాకుండా చక్కగా నటించేసింది. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా అందరూ చక్కగా నటించేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, తులసి, తణికెళ్ల భరణి ఇలా అందరూ కూడా తమ పరిధి మేరకు చక్కగా నటించారు. SR కళ్యాణమండపం సినిమా విషయానికి వస్తే తెర మీద కిరణ్ అబ్బవరమే కనిపిస్తాడు. తెర వెనుక కూడా కిరణ్ అబ్బవరమే వినిపిస్తాడు. ఎందుకు ఈ కథ రాసింది.. అల్లింది.. మాటలు పేర్చింది కూడా అతనే. ఈ కథ కొత్తదేమీ కాకపోయినా.. రాసుకున్న విధానం బాగుంటుంది. తండ్రీ కొడుకుల ఎమోషన్ మీద ఇప్పటికే బోలెడన్ని సినిమాలున్నాయి. ఇది కూడా అలాంటి ఓ కథే. తండ్రి గౌరవాన్ని నిలబట్టేందుకు కొడుకు చేసే ప్రయత్నాలే ఈ సినిమా. SR కళ్యాణమండపం కథలోని మూలం కూడా అదే. అయితే ఈ కథలో కామెడీ, లవ్ ఇలా అన్నింటిని సమపాళ్లలో రాసుకోవడంతో గట్టెక్కినట్టు అనిపిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని లాజిక్‌లు మిస్ అయినట్టు అనిపిస్తుంది. కథ కొన్ని సార్లు గతంలో జరిగినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రస్తుత కాలమానంలో తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు ఈ చిత్రంలో అందరూ కలిసి ఖుషి సినిమాకు వెళ్తారు. అది ఎప్పుడు రిలీజ్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇంకొన్ని సీన్లలో వాట్సప్‌లు వాడుతున్నట్టు కూడా చూపిస్తారు. అలా ఈ సినిమాకు సరైన కాలమానాన్ని చూపించినట్టు అనిపించదు. అయితే ఈ లాజిక్‌లన్నీ కూడా వదిలిస్తే.. సినిమాను మాత్రం బాగానే ఎంజాయ్ చేయగలుగుతారు. మొదటి ఓ 20 నిమిషాలు అంతగా ఎక్కకపోయినా.. మెల్లిమెల్లిగా కథలోకి లీనమయ్యేట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లోనే ఈ సినిమా కాస్త రన్ వే మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. లవ్ సాంగ్స్ ఇప్పటికే అందరినీ మెప్పించాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా బాగానే ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా మాటలు మాత్రం అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎండ్ కార్డ్‌లో కిరణ్ అబ్బవరం పేరిట ఓ లైన్ వస్తుంది. సంపాదించినా సంపాదించిక పోయినా మిగిల్చినా మిగిల్చకపోయినా కూడా మా నాయన నాకు ఎప్పటికీ రాజే అని కిరణ్ అబ్బవరం అంటాడు. అలా ఈ సినిమా కథను తన రియల్ లైఫ్‌లోంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం కథను శ్రీధర్ గాధే తెరపై అందంగా చిత్రీకరించాడు. ఆ విషయంలో దర్శకుడిగా శ్రీధర్ పాసైనట్టు కనిపిస్తుంది. ఇక పోతే కెమెరా మెన్ కొన్ని సార్లు తన వింత యాంగిల్స్‌లో ప్రేక్షకులకు విసుగు తెప్పించినట్టు అనిపిస్తుంది. అందులోనూ ఏదైనా నిగూఢ అర్థముందో ఏమో అది దర్శకుడికి, కెమెరామెన్‌కు మాత్రమే తెలియాలి. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. చిరవగా : SR కళ్యాణమండపం.. మొత్తంగా కళకళలాడింది!
from https://ift.tt/2VwrGU3
No comments:
Post a Comment