మిగతా ఫీల్డ్స్ సంగతి ఎలా ఉన్నా గ్లామర్ ఫీల్డ్‌లో మాత్రం రారాజు ఎవరంటే వయసు వెనక్కి వెళ్లేవాళ్లు. అసలు వయసు ఎంతున్నా.. చూడ్డానికి మాత్రం ఏం ఉన్నాడ్రా బాబూ అనేట్టుగా నవ మన్మథుడి మాదిరిగానే కనిపించాలి. ఎంత నవ యవ్వనంగా కనిపిస్తే అంత క్రేజ్, ఫాలోయింగ్ అన్నమాట. ఈ విషయంలో వయసు వెనక్కి వెళ్లే వరంతో ఏమైనా పుట్టాడా అనేట్టుగానే ఉంటాడు. కాస్త అతిశయోక్తిగానే ఉన్నా మహేష్ బాబు.. వయసు , అందం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంది అనేట్టుగానే ఉంది. బర్త్ డే పూట ఎక్కడ చూసినా పొగడ్తలు.. ప్రశంసలే ఉంటాయి కనుక.. ఈ ఘట్టమనేని వంశోద్ధారకుడికి 46వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం. మహేష్.. ఆ పేరులో ఉన్న మత్తు, వైబ్రేషన్స్ అమ్మాయిల గుండె లయల్ని తాకుతూ ఉంటుంది. ఏం ఉన్నాడే బాబూ ఈ మహేష్ బాబూ అని బొటనవేలు నేలని రాస్తూ ఓరచూపులు వెంబడిస్తూనే ఉంటాయి. ఆ స్మైల్.. ఆ లుక్‌కి పడనివాళ్లుంటే వేళ్లపై లెక్కపెట్టేయొచ్చు సుమీ.. నటశేఖరుడు వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘రాజకుమారుడి’గా ఎంట్రీ ఇచ్చి ‘యువరాజు’గా వెలుగొంది.. ‘మురారి’తోమెప్పించి.. అమ్మాయిల మనసుదోచే ‘టక్కరిదొంగ’గా మారాడు. ఆ ‘ఒక్కడు’కి ఎదురేలేకుండా తన ‘దూకుడు’ ఆపకుండా ‘పోకిరి’తో తన ‘ఖలేజా’చూపిస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేసే ‘సైనికుడి’గా మారి టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. ‘అతిథి’లా అప్పుడప్పుడూ కాకుండా .. పక్కా ‘బిజినెస్‌మేన్’లా మారి..‘1 నేనొక్కడినే’నంటూ ‘స్పైడర్’మేన్‌లా దూసుకెళ్లి.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లా విరజిల్లే‘అతడు’ ఈ టాలీవుడ్ ‘శ్రీమంతుడు’.. ‘భరత్ అనే నేను’.. అంటూ బ్రహ్మాండమైన హిట్ కొట్టి.. ‘మహర్షి’తో ఇండస్ట్రీని షేక్ చేసి ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకున్న మహేష్ బాబు పుట్టినరోజుని‘బ్రహ్మోత్సవం’లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. రాబోయే చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్ ఫ్లాప్ సంగతి అంటుంచితే.. తన ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసే సినిమా కోసం పరితపిస్తుంటారు సూపర్ స్టార్. అందం, అభినయం, ప్రయోగాత్మక కథలులతో పాటు... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం.. ఇదీ మహేష్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే. ఈ బుర్రెపాలెం కుర్రోడు.. నటశేఖర కృష్ణ, ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న జన్మించాడు. నాన్న సూపర్ స్టార్ కావడంతో వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహేష్ బాబు బాలనటుడిగానే నట ప్రస్థానం మొదలుపెట్టి సత్తా చూపించాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాల నటుడిగా ఎక్కువ సినిమాల్లో నటించింది మహేష్ బాబే కావడం విశేషం. నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా నీడ సినిమాతో పరిచయమయ్యాడు మహేష్ బాబు. తన తండ్రి కృష్ణతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. 1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘పోరాటం’ సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించి మెప్పించాడు. ఆ తరువాత వరుసగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’ చిత్రాలతో బాల నటుడిగా మెప్పించి.. తిరిగి 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి హీరోగా 26 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను అందుకున్నాడు. తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే నంద అవార్డుతో వేట మొదలుపెట్టిన మహేష్ బాబు.. ఆ తరువాత ‘నిజం’ ‘అతడు’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డుల్ని కైవసం చేసుకుని రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేష్ బాబుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ చివరిగా ఒక్క మాట.. మహేష్ బాబు అందం, అభినయం వరకూ ఒకే కానీ.. ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకునే పాత్రలు.. పలికించే హావభావాలు ఒకే విధంగా ఉండటం కాస్త లోటుగానే కనిపిస్తుంది. మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ.. మహేష్‌లోని పరిపూర్ణమైన నటుడు బయటకు రావాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్.
from https://ift.tt/3iy8qy6
No comments:
Post a Comment