తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పేరుమోసిన ఎంతో మంది స్టార్ హీరోలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. ఆయా హీరోల శైలికి తగ్గట్టు వారే పాడుతున్నారేమో అన్నట్టుగా తన గమ్మత్తయిన గళంతో పాటకు ప్రాణం పోశారు ఎస్పీబీ. అలాంటి దిగ్గజ గాయకుడికి ఒక స్టార్ హీరో తన గొంతును అరువు ఇస్తే అది కచ్చితంగా విచిత్రమే కదా. ఈ విచిత్రం సుమారు 27 ఏళ్ల క్రితం కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది. కన్నడ సినీ పరిశ్రమలో డాక్టర్ రాజ్‌కుమార్ నటసార్వభౌమ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వ. ఒకరు నటనలో దిగ్గజం అయితే.. మరొకరు గానంలో దిగ్గజం. ఇద్దరికీ బోలెడంత అభిమానగణం అక్కడ. అయితే, వీళ్లద్దిరి మధ్య ఒక ఆసక్తికర అనుబంధం ఉంది. ఒకరి కోసం ఒకరు పాటలు పాడిన అనుబంధం. సాధారణంగా రాజ్‌కుమార్ తన సినిమాలో పాటలను తానే పాడుకుంటారు. కానీ, ‘శ్రీ శ్రీనివాస కళ్యాణ’ చిత్రం కోసం తొలిసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రూపంలో వేరే గాయకుడిని రాజ్‌కుమార్ తీసుకున్నారు. ‘శ్రీ శ్రీనివాస కళ్యాణ’ సినిమాలో రాజ్‌కుమార్ విష్ణుమూర్తి పాత్ర పోషించారు. తన పాత్రకు తానే పాడుకున్నారు. అయితే, విష్ణుమూర్తిని కీర్తించే హతీరాం బాబా పాత్రకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. ఇది రాజ్‌కుమార్ స్వయంగా నిర్మించిన చిత్రం. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలు ఇప్పటికీ కన్నడ నాట పాపులర్. అంతేకాదు, ఎస్పీబీ పాడిన ఆ పాటలు రాజ్‌కుమార్‌కు ఎంతో ఇష్టమని, ఆయన మనసుకు దగ్గరైన పాటలని కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ చెబుతుంటారు. ఇదిలా ఉంటే, ‘ముద్దిన మావ’ అనే సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్రకు డాక్టర్ రాజ్‌కుమార్ పాటలు పాడటం మరో విశేషం. తెలుగులో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘మామగారు’ సినిమాను కన్నడలో ‘ముద్దిన మావ’గా రీమేక్ చేశారు. తెలుగులో దాసరి పోషించిన పాత్రను కన్నడలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేశారు. అంతేకాదు, ఈ సినిమాకు ఎస్పీబీ సంగీతం సమకూర్చారు. తన పాత్రకు తానేపాడుకొని హీరో శశికుమార్‌కు వేరే గాయకుడు పాడిద్దామని బాలు అనుకున్నారు. కానీ, దానికి శశికుమార్ ఒప్పుకోలేదు. దీని పరిష్కారం కోసం ఆలోచించిన బాలు.. తన పాత్రకు రాజ్‌కుమార్ పాడితే బాగుంటుందని భావించి ఆయన వద్దకు వెళ్లారు. మొదట రాజ్‌కుమార్ అంగీకరించలేదట. ‘‘కన్నడలో మీకంటూ ఓ అభిమానగణం ఉంది.. మీకు నేను పాడిన పాట వాళ్లకు నచ్చకపోతే నా పరువు, మీ పరువు పోతుంది.. పేరున్న గాయకుడికి పాడే సాహసం నేను చేయలేను’’ అన్నారట. బాలు పాత్రకు పాట పాడటానికి ససేమిరా అన్నారట. కానీ, బాలు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా రాజ్‌కుమార్‌ను ఒప్పించి పాడించుకున్నారు. ‘ముద్దిన మావ’లో ‘దీపావళి దీపావళి’, ‘కన్నప్పకొట్టను కండను’ అనే పాటలు రాజ్‌కుమార్ పాడారు. ‘దీపావళి దీపావళి’ పాటలో హీరో శశికుమార్‌కు బాలు గాత్రం ఉంటుంది. Also Read:
from https://ift.tt/3mT8CrV
No comments:
Post a Comment