ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను అన్నిదేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత దేశంలో లాక్‌డౌన్ విధిస్తూ అందరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది కేంద్రప్రభుత్వం. దీంతో పరిశ్రమలన్నీ మూతపడి పేద ప్రజలు ఉపాధి కోల్పోయారు. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పేదలకు నిత్యావసర సరుకులు, ఆర్ధిక సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త, షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఆనంద్ తన మిత్రుల సహకారంతో బంజారా మహిళా యన్‌జీవో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో సహాయక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు (మే 9) తన మిత్రురాలు దివ్య రావెళ్ళతో కలిసి ఢిల్లీలోని వలస కూలీలు, పేద వారి కోసం నిత్యావసర వస్తువులను అందించారు ఆనంద్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఓ ఫిల్మ్ డైరెక్టర్‌గా, అభిమానిగా తాను ఈ సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశానని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతూ.. విజయ్ దేవరకొండ లాంటి మంచి మనసున్న హీరోలు ఇండస్ట్రీకి చాలా అవసరమని, ఆయన తన ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ప్రజలకు చేస్తున్న సేవలు అందరికీ స్పూర్తి దాయకమని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా భౌతిక దూరాన్ని పాటించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయాన్ని పేద ప్రజల కోసం అందించాలని కోరారు. పలు సామాజిక లఘు చిత్రాలు రూపొందించి జాతీయ అవార్డును అందుకున్న డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ 'చిరుతేజ్ సింగ్' లఘు చిత్రంతో ఫేమస్ అయ్యారు. ఈ లఘు చిత్రానికి సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రత్యేక ప్రశంస అవార్డు లభించింది. బాల మేధావి చిరుతేజ్ సింగ్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ రూపొందించిన ఈ లఘు చిత్రం అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత జ్యాత్యహంకార దాడులపై 'రెయిన్ బో' అనే మ్యూజిక్ వీడియోను అనన్య పెనుగొండ అనే నూతన గాయనిని పరిచయం చేస్తూ రూపొందించారు. అది విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలై తెలంగాణా ప్రభుత్వ ప్రశంసలు అందుకుంది.
from https://ift.tt/2xRPVAk
No comments:
Post a Comment